దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మధ్య జరిగిన సమావేశంలో విప్రో సంస్థ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ విస్తరణకు సై అంటూ కీలక ప్రకటన చేసింది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా ఐటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ విస్తరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 5000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తి కానుంది.
విప్రో విస్తరణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విప్రో లాంటి దిగ్గజ సంస్థలకు తగిన మద్దతు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌లో ఐటీ రంగం మరింత బలోపేతమవుతుందని, రాష్ట్రానికి గ్లోబల్ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా పేరుప్రతిష్ఠలు చేకూరతాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రిషద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ, “తెలంగాణలో కొత్త ఆవిష్కరణల పర్యావరణం, ప్రభుత్వ మద్దతు మా ప్రాజెక్టులకు మరింత బలం చేకూరుస్తున్నాయి” అని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు విప్రో సుముఖంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణ ఐటీ రంగంలో మరింత ప్రాధాన్యతను సంపాదించనుంది. సమగ్ర అభివృద్ధికి విప్రో సహకారం కీలకమని ప్రభుత్వం పేర్కొంది.