విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కాజ వద్ద టోల్‌ప్లాజాలో వాహనదారులపై తీవ్ర భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా, ప్రతిసారి పూర్తి టోల్ చెల్లించాల్సి ఉంటుంది. మునుపటి నిబంధనల ప్రకారం, ఒకసారి పూర్తిగా టోల్ చెల్లించి తిరుగు ప్రయాణంలో సగం మాత్రమే చెల్లించేవారు. ఇప్పుడు అయితే, రెండో ప్రయాణానికి కూడా పూర్తిగా టోల్ వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని 69 టోల్‌ప్లాజాలలో 65 ప్లాజాలలో ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. కీసర, వెంకటాచలం, బూదరం, సూళ్లూరుపేట టోల్‌ప్లాజాలు మాత్రం పాత విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ ప్లాజాల్లో 24 గంటల్లో ఎన్నిసార్లు ప్రయాణించినా మొదటి సారి పూర్తిఫీజు, రెండవసారి సగం మాత్రమే చెల్లించాలి. వీటి గుత్తేదారుల బీవోటీ గడువు 2031 వరకు ఉండటంతో పాత విధానమే కొనసాగుతుంది.