దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడంపై కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్లమెంట్ లోక్‌సభ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చలు జరుగగా, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బిల్లును స్వాగతిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలి ఎన్నికల వల్ల దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, ఓటింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రాంతీయ రాజకీయ పార్టీల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ‘‘ఈ బిల్లు సుపరిపాలనకు మార్గదర్శిగా నిలుస్తుంది. అభివృద్ధి, ప్రజాస్వామ్యానికి ఇది మేలిచేస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే టీడీపీ పార్టీ ఈ బిల్లును పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం సభలో చర్చనీయాంశమైంది.