ఏపీ కేబినెట్‌లో జనసేన పార్టీకి చెందిన నాగబాబు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగబాబు, ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వారంలోనే జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణతో పాటు, పదమూడో తేదీన విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, నాగబాబుకు ప్రమాణ స్వీకారం జరగడానికి రెండు రోజుల తర్వాత అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, ఒక మంత్రి ప్రమాణ స్వీకారానికి ఎక్కువ సమయం పట్టదు కనుక, రేపైనా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ శాఖ ప్రస్తుతం జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉంది. సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు అప్పగించడం ద్వారా, ఆయనకు రాజకీయంగా మంచి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఇది ఒక ప్రాధమిక సమాచారం మాత్రమే కాగా, అధికారికంగా రాజ్ భవన్‌కు సమాచారం పంపితే అక్కడి వర్గాలు ఏర్పాట్లు చేస్తాయని తెలుస్తోంది. నాగబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తాన్ని ఆయన నిర్ణయిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.