హైదరాబాద్, డిసెంబర్ 18: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని సాక్ష్యాలతో తేల్చిచెప్పినా, అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు డీపీఆర్ లేదని చెప్పడం తప్పుడు ప్రకటనగా ఆమె ఆరోపించారు. “ప్రజలను, చట్టసభలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వానికి ఏ అవసరం?” అంటూ కవిత ప్రశ్నించారు.
సభ ముందు మాట్లాడిన కవిత, మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం చూపుతున్న గందరగోళంపై తీవ్ర విమర్శలు చేశారు. “ప్రపంచ బ్యాంకును ఆశ్రయించి రూ. 4,100 కోట్ల రుణం కోరడం వాస్తవమా కాదా? పేద ప్రజల భూములను లాక్కొని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయాలనే దురుద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రపంచ బ్యాంకు ముందు తలవంచిందని, ఇది తెలంగాణ సాంప్రదాయాలకు తగనిదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాస ప్రణాళిక లేకుండా 15,000 ఇళ్లకు గుర్తింపు పెట్టడం, నిర్వాసితుల పట్ల అన్యాయం చేయడం అనాగరికమైన చర్య అని పేర్కొన్నారు.