తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల జలపాతం కొనసాగుతోంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) రూ.15,000 కోట్లతో మూడు ప్రధాన ప్రాజెక్టులకు అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇందులో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్, 1,000 మెగావాట్ల బ్యాటరీ నిల్వ వ్యవస్థ, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్‌నెస్ రిసార్ట్ నిర్మాణం ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 7,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.
స్కైరూట్, యునిలీవర్ ముందడుగు స్కైరూట్ ఏరోస్పేస్ తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.500 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. యునిలీవర్ సంస్థ, పామాయిల్ పరిశ్రమతో పాటు బాటిల్ క్యాప్ తయారీ యూనిట్లను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.
పునరుత్పాదక ఇంధనంపై దృష్టి ఈ ఒప్పందాలు, తెలంగాణ ప్రభుత్వ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాలను బలోపేతం చేస్తాయి. బ్యాటరీ నిల్వ వ్యవస్థ ప్రాజెక్ట్ రాష్ట్రంలో రెండు సంవత్సరాలలో 4,000 ఉద్యోగాలను సృష్టించనుంది.
దావోస్ వేదికగా తెలంగాణ పెట్టుబడులకు ప్రపంచ వేదికగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.