కాకినాడ యాంకరేజి పోర్టులో స్టెల్లా ఎల్ పనామా నౌక నుంచి 1,320 టన్నుల పేదల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ అక్రమంగా పశ్చిమ ఆఫ్రికాకు తరలించేందుకు సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. బార్జిలో లభించిన 1,064 టన్నుల పీడీఎస్ బియ్యం లోడింగ్‌కు సంబంధించి మరింత సమాచారం సేకరించామని చెప్పారు.
నవంబరు 27న జరిగిన తనిఖీల సమయంలో, నౌకలోని నమూనాలు పరీక్షించి, పీడీఎస్ బియ్యం ఉన్నట్లు ధృవీకరించామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బియ్యం ఎక్కడి నుంచి సేకరించారన్న దిశగా మిల్లర్లు, వ్యాపారులపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. లవణ్ ఇంటర్నేషనల్, సాయితేజ అగ్రోస్ సంస్థల భాగస్వాములు బార్జిలో ఉన్న నిల్వలపై కీలకమైన సమాచారం అందించారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక సిట్ కమిటీని ఏర్పాటు చేసి, నౌకలోని బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తుందని కలెక్టర్ స్పష్టంచేశారు. నౌకను పూర్తిగా అన్బ్లోడ్ చేసి, పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు 48 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.