జమిలి ఎన్నికల (One Nation One Election) నిర్వహణకు సంబంధించి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కు పరిశీలనకు పంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసి, తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులో “ఒకే దేశం… ఒకే ఎన్నిక” అనే భావనను సమర్థించే నిబంధనలు పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే విధానాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. కేంద్రం లక్ష్యం 2029 నాటికి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కాగా, 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలకూ జమిలి పరిధిని విస్తరించాలనే యోచనలో ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుకలిగేలా కొన్ని ప్రత్యేక నిబంధనలను బిల్లులో చేర్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో రాజ్యాంగ సవరణలపై రాజకీయ పార్టీల మధ్య విస్తృత చర్చ జరుగుతుండగా, కొన్ని పార్టీలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు కీలకంగా మారాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉంది. జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు పూర్తి చేయాలంటే రాజకీయ, సాంకేతిక సవాళ్లను అధిగమించడం ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారనుంది.