డిసెంబర్ నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు ఇప్పుడు ప్రజలకు ఊరటనిచ్చే విధంగా దిగివస్తున్నాయి. శుక్రవారం, డిసెంబర్ 19న, దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మరోసారి తగ్గుదల కనిపించింది.
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,640కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,340 వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. వెండి ధర విషయంలో చూస్తే, హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లో కిలో వెండి ధర రూ. 98,900గా ఉంది.
దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి, చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,790 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 69,490గా నమోదైంది. ముంబయిలో 24 క్యారెట్ల బంగారం రూ. 75,640, 22 క్యారెట్ల ధర రూ. 69,340గా ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం, డాలర్ విలువ పెరగడం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పడిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ నెలలో వరుసగా తగ్గుతున్న ఈ ధరలు, బంగారం ప్రియులకు ఆనందాన్ని కలిగించాయి.