ఫార్ములా ఈ రేస్ వ్యవహారం: కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ దిశగా విచారణ వేగవంతం!

తెలంగాణ రాజకీయ వాతావరణంలో మరో సంచలనానికి దారితీసిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (యాంటీ-కరప్షన్ బ్యూరో) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనే అంశంపై గవర్నర్‌కు లేఖ రాయడం కలకలం రేపింది.

2022లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన తొమ్మిదో సీజన్ ఫార్ములా-ఈ రేస్‌కి సంబంధించిన ఈ కేసులో ముఖ్య ఆరోపణలు ఏమిటంటే, పదో సీజన్ నిర్వహణకు ముందు ఒప్పందం రద్దు చేయకుండా అక్రమంగా నిధులు మళ్లించడమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సహా ఇతర అధికారులపై కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గవర్నర్ అనుమతులు, ఇతర అధికారుల పాత్ర రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. దీనికి తోడు, ఎన్నికల షెడ్యూల్ సమయంలో కూడా ఎఫ్‌ఈవోకు భారీ నిధులు చెల్లించడంపై ఆరోపణలు మరింత వేగంగా విచారణకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు