సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్, తిరుగుబాటుదారులు డమాస్కస్‌లోకి ప్రవేశించడంతో, దేశాన్ని విడిచి పారిపోయారు. ఇది 24 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆయన పాలనకు ముగింపు పలికింది. తిరుగుబాటుదారులు, రష్యా మరియు ఇరాన్ మద్దతు పొందిన అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ, డమాస్కస్ నగరంలోకి అడుగుపెట్టారు.
ప్రధాని మహమ్మద్ ఘాజీ జలాలి, తిరుగుబాటుదారులకు శాంతియుతంగా అధికార మార్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వ కార్యకలాపాలను ప్రతిపక్షానికి అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. అయితే, అసద్ దేశాన్ని విడిచిపెట్టిన విషయం పై జలాలి స్పందించలేదు.
అసద్ పారిపోయిన తర్వాత, తిరుగుబాటుదారులు కీలక నగరాలను ఆక్రమిస్తూ, రాజధానిలోకి ప్రవేశించారు. ఈ దళాలకు టర్కీ మద్దతు ఉన్నట్లు సమాచారం. డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రం నుండి సిరియన్ ఎయిర్ విమానం బయలుదేరిన తర్వాత, అసద్ రాడార్ నుండి అదృశ్యమయ్యాడు. ఈ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిరియాలోని ప్రజలు అసద్ పాలన ముగిసిన సందర్భంగా సంబరాలు జరుపుతున్నారు. తిరుగుబాటుదారులు ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించినట్లు ప్రకటించారు. “మా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం” అని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం నిరంకుశ పాలనకు ముగింపు పలికినట్లు ప్రజలు భావిస్తున్నారు.
అంతర్జాతీయ సమాజం ఈ పరిణామంపై ఆసక్తిగా ఉంది. ఐరాసలో సిరియా రాయబారి గెయిర్ పెడర్‌సన్ కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం చర్చలు జరిపే అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా వంటి దేశాల విదేశాంగ మంత్రులు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, సిరియాలో కొత్త రాజకీయ పరిస్థితులు ఏర్పడటంతో, ప్రజల భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.