నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తమిళనాడు తీరం వైపుకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచనలు వెలువడ్డాయి.
శాటిలైట్ డేటా ప్రకారం, ఈ అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తెలంగాణలో వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ చలి తీవ్రంగా ఉంటుంది.
వాతావరణ శాఖ తాజా సూచనల ప్రకారం, బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 35 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలెర్ట్‌లు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.