హైదరాబాద్, డిసెంబర్ 7: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ భావోద్వేగంతో స్పందించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటంపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఐకాన్ స్టార్ తన తరఫున రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, రేవతి కుమారుడి చికిత్సకు అవసరమైన అన్ని వైద్య ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. రేవతి పిల్లల భవిష్యత్తు కోసం తాను అన్ని విధాలా అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అల్లు అర్జున్, తాను వ్యక్తిగతంగా కూడా బాధిత కుటుంబాన్ని కలిసి ఆర్థిక, మానసిక సాయం అందిస్తానని తెలియజేశారు.
“20 ఏళ్లుగా థియేటర్లలో అభిమానులతో కలిసి సినిమాలు చూసే అనుభవం నాకు ఉంది. కానీ ఇలాంటి ఘటన నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఈ విషాదకర సంఘటనను విని తీవ్ర నిరాశకు గురయ్యాను. మేము సినిమా తీసేది ప్రేక్షకులు కుటుంబాలతో కలిసి ఆనందించడానికి మాత్రమే. కానీ ఇలాంటి ఘటనలు మనల్ని మానసికంగా కూడా బాధిస్తాయి,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు విజ్ఞప్తిగా “సినిమా చూడడానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరంతా సేఫ్గా తిరిగి ఇంటికి వెళ్లాలి. ఎంజాయ్ చేయడానికి పుష్ప-2 తీసాం, కానీ ఇలాంటి ఘటనలు మాకు బాధాకరంగా ఉంటాయి,” అని సూచించారు.
ఈ ఘటన తర్వాత, పుష్ప-2 టీం సంతోష వేడుకలను కూడా నిలిపివేసినట్లు తెలిపారు. రేవతి మరణంతో తాము ఎంత చేసినా ఆ నష్టాన్ని భర్తీ చేయలేమని, కానీ ఆమె కుటుంబానికి తమ శక్తి మేర సాయంగా నిలుస్తామని అల్లు అర్జున్ తెలిపారు.