హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బుధవారం పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్, శ్రీతేజ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్యుల నుంచి శ్రీతేజ్ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో ఆయన శ్రీతేజ్ తల్లి రేవతి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం అనేది అత్యంత దురదృష్టకరమని అభివర్ణించిన అరవింద్, తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకారం అందిస్తోందని చెప్పారు. కాగా, కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయినట్లు వెల్లడించారు. తన కొడుకు తరఫున తానే ఆస్పత్రికి వచ్చానని తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు తెలియజేశారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగడం లేదని, ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని వారు చెప్పారు.