హైదరాబాద్, డిసెంబర్ 24: నగరంలోని రాయదుర్గం సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని ఐరేని శివాని (21) దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాయదుర్గం ఎస్‌ఐ ప్రణయ్ తేజ్ వివరాల ప్రకారం, కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన శివాని గండిపేట్ సీబీఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆదివారం తన పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, తిరిగి హాస్టల్ చేరేందుకు ఆమె ప్రయాణమైంది. హాస్టల్‌కు చేరడానికి స్నేహితుడు వెంకట్‌రెడ్డి (26) సహాయం తీసుకుని బైక్‌పై ప్రయాణిస్తోంది.
అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివాని స్పాట్‌డెడ్ కాగా, వెంకట్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ శ్రీకాలేష్ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నగరంలోని ఓ ఆసుపత్రి వైద్యుడి కుమారుడిగా గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
చదువులో ప్రతిభావంతురాలైన శివాని ఇటీవల ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికైంది. తన కుటుంబానికి ఆర్థిక భరోసా కావాలని ఆశించిన సమయంలో ఈ అనుకోని ప్రమాదం కుటుంబాన్ని విషాదంలో నెట్టింది.