ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు అమరావతికి రూ.6,800 కోట్ల రుణాన్ని ఆమోదించినట్లు సమాచారం. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా రూ.6,700 కోట్ల రుణాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజా రుణ ఆమోదంతో రాజధాని నిర్మాణానికి మొత్తం రూ.13,500 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతి నిర్మాణానికి మద్దతు ప్రకటించింది. ఈ నిధులను ప్రపంచ బ్యాంకు, ADBతోపాటు హడ్కో, జర్మనీ బ్యాంకు KfW వంటి సంస్థల ద్వారా సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, వరద ముంపు నివారణ, క్వార్టర్లు, ఇతర అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతున్నాయి.