ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఓపెనర్ నాథన్ మెక్‌స్వినీ స్థానాన్ని యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ ఆక్రమించాడు. సిడ్‌నీ థండర్ తరఫున బిగ్ బాష్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సామ్‌కు జట్టులో చోటు దక్కడం విశేషం. ఇక, మూడు సంవత్సరాల తర్వాత పేసర్ జే రిచర్డ్‌సన్ తిరిగి జట్టులోకి రావడం మరో ముఖ్యమైన పరిణామం. బ్రిస్బేన్ మూడో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ 1-1తో సమానంగా ఉంది. తదుపరి టెస్టు మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుండి 30 వరకు జరుగనుంది, చివరి టెస్టు జనవరి 3 నుండి 7 వరకు సిడ్నీలో జరగనుంది.