పాన్ఇండియా స్టార్ రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ సినిమా విజయోత్సవంలో మునిగిపోయిన ఆమె, ఒక ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “నా భాగస్వామి జీవితంలో ప్రతీ దశలో నాకు తోడుగా ఉండాలి. కష్టసమయాల్లో నాకు మద్దతుగా నిలవాలి. అన్నివేళలా భద్రతనివ్వడం, గౌరవం చూపించడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నాను. బంధం నిలవాలంటే ఇద్దరిలోనూ పరస్పర శ్రద్ధ ఉండాలి. మంచి మనసుతో కలసి జీవించే సామర్థ్యం అవసరం” అని చెప్పారు.
ప్రేమ గురించీ రష్మిక మాట్లాడారు. “ప్రతీ ఒక్కరి జీవితంలో తోడు చాలా కీలకమైనది. ప్రేమలో ఉన్నదంటే జీవన భాగస్వామిని కలిగి ఉండడమే. తోడు లేకుండా జీవితం నిస్సారమైపోతుంది. ఒడిదుడుకుల్లో మనకు మద్దతుగా నిలిచే వ్యక్తి జీవితాన్ని సార్ధకం చేస్తాడు” అని ఆమె స్పష్టం చేశారు.
ఇకపోతే, రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2 ది రూల్ సినిమా పాన్ఇండియా స్థాయిలో వసూళ్ల వరద సృష్టిస్తూ రూ.1500 కోట్ల మార్క్‌ను దాటేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే, రష్మిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ కూడా ఇటీవల విడుదలైంది. విజయ్ దేవరకొండ వాయిస్ అందించిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేమ కథ ఆధారంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రానుంది.