హైదరాబాద్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు గురవుతున్న అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛలో రాజ్ భవన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నాయకత్వం వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు నిర్వహించిన ర్యాలీకి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
నిరసన ర్యాలీకి అడ్డుగా పోలీసులు నిలవడంతో, సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అదానీ, మోదీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. పార్లమెంట్లో అదానీ అవినీతి గురించి చర్చకు కేంద్రం సిద్ధంగా లేదు. జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తాం. దేశం వ్యాపార ఆర్థిక రంగానికి హానికలిగించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది,” అని విమర్శలు గుప్పించారు.
మరోవైపు, బీఆర్ఎస్ బీజేపీకి మౌనంగా లొంగిపోయిందని ఆరోపిస్తూ, నిరసన కార్యక్రమాల్లో ఎక్కడా స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదానీ లంచాల అంశంపై అమెరికాలో దాఖలైన నివేదికలను ప్రస్తావిస్తూ, ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.
అంతేగాక, “మోదీ, కేసీఆర్ ఇద్దరూ నాణానికి బొమ్మాబొరుసుల్లా పనిచేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నిరసనతో దేశ ప్రజల న్యాయమైన హక్కులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ పూర్తిగా కట్టుబడి ఉంది,” అని ఆయన తెలిపారు.