భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి రావడం ప్రజల్లో ఆసక్తిని రేపింది. ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆటో నడిపి అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ సభ్యులు ఖాకీ చొక్కాలు ధరించి, ఆటోల్లోనే రాకపోకలు సాగించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ చర్య ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో భాగమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆటో డ్రైవర్లకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణం. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దు, న్యాయం జరిగేవరకు పోరాడుతాం,” అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో శాసనసభలో కూడా ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం పెట్టింది. ఆటో కార్మికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, వారి హక్కులను రక్షించడానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.