సియోల్: దక్షిణ కొరియాలో మార్షల్ లా ప్రకటన తాలూకు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ గురువారం పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కొత్త రక్షణ మంత్రిగా చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను నియమించారు. చోయ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో దక్షిణ కొరియా రాయబారిగా ఉన్నారు. ఆయన నియామకాన్ని పార్లమెంటు లాంఛనంగా ఆమోదించాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో ప్రధాని మినహా ఇతర మంత్రులను నియమించే అధికారం పూర్తిగా అధ్యక్షుడికే ఉంటుంది. అంతకుముందు- మార్షల్ లా ప్రకటన (తర్వాత ఎత్తివేశారు) నేపథ్యంలో యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్‌లను పదవుల నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో తీర్మానాలు ప్రవేశపెట్టాయి. దేశంలో మార్షల్ లా విధించాలని అధ్యక్షుడికి హ్యూన్ సిఫార్సు చేశారని తీర్మానంలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. హ్యూన్ కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. తన ఆదేశాల ప్రకారమే సైన్యం నడుచుకుందని పేర్కొన్నారు. రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. అంతలో అధ్యక్షుడే ఆయన్ను పదవి నుంచి తప్పించారు. అధ్యక్షుడిపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై ఆదివారంలోగా ఓటింగ్ జరగనుంది.
‘అది డీప్ ఫేక్ అనుకున్నా’
మార్షల్ లా విధిస్తూ దేశాధ్యక్షుడు యోల్ మంగళవారం చేసిన ప్రకటనను తాను తొలుత డీప్‌ఫేక్‌గా భ్రమపడినట్లు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేత లీజే మ్యూంగ్ చెప్పారు. ‘‘ఆ రోజు నా భార్య యూట్యూబ్‌లో ఒక వీడియో చూపిస్తూ.. ‘అధ్యక్షుడు మార్షల్ లా విధించారు’ అని చెప్పింది. నేను దానిని పట్టించుకోకుండా.. అది డీప్‌ఫేక్ అయ్యుంటుందని చెప్పాను. కానీ అదే నిజమని తర్వాత అర్థమైంది’’ అని గురువారం మ్యూంగ్ పేర్కొన్నారు.