చిల్డ్రన్స్ డే రోజున..రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించిన షియోమీ

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ ఒకే రోజు రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. బాలల దినోత్సవం సందర్భంగా 24 గంటల్లోనే 18వేల కిలోల బరువున్న 1.10 లక్షల నోట్‌బుక్స్‌ను దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేయడంతోపాటు వాటితో ప్రపంచంలోనే అతి పెద్ద నోట్‌బుక్ మొజాయిక్‌ను సృష్టించి రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది.

యునైటెడ్ వే అనే ఓ స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యమైన షియోమీ రీసైకిల్డ్ పేపర్‌తో 1.10 లక్షల నోట్ పుస్తకాలను తయారు చేసి కేవలం 24 గంటల్లోనే వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసింది. దీంతో ఒక్క రోజులోనే ప్రభుత్వ స్కూళ్లకు కావల్సిన విద్యాసామగ్రిని భారీగా విరాళంగా అందజేసినందుకు గాను షియోమీ గిన్నిస్ రికార్డును సాధించింది. అయితే అంతకు ముందు ఆ నోట్ పుస్తకాలతో షియోమీ సిబ్బంది 1950 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ప్రపంచంలోనే అతి పెద్ద నోట్‌బుక్ మొజాయిక్‌ను తీర్చిదిద్దారు. దీంతో ఆ ఘనత సాధించినందుకు కూడా షియోమీని మరో గిన్నిస్ రికార్డు వరించింది. కాగా ఇప్పటికే ఆ సంస్థ పలు అంశాల్లో గిన్నిస్ రికార్డులను నమోదు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద లైట్ మొజాయిక్, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రిటెయిల్ స్టోర్లు కొనసాగిస్తున్న సంస్థగా షియోమీ గిన్నిస్ రికార్డులను సాధించగా, ఇవాళ సాధించిన ఆ రెండు రికార్డులు ఆ జాబితాలో చేరాయి.