కోటిన్నర భక్తులు.. 10వేల మంది పోలీసులు, ఏర్పాట్లు చకచకా..

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన పేరొందని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ జాతర నిర్వహణ కోసం భారీగా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు దీనిపై సమీక్షలు జరుపుతున్నారు. జాతర ఏర్పాట్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం మహాజాతర కోసం 10వేల మంది పోలీసులు సేవలు అందిస్తారని తెలిపారు. జాతర విధుల్లో ఉండే పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, అందరూ తమతమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. జాతరకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, భక్తులకు అసౌకర్యంగా కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీ పాసులు, ప్రోటోకాల్‌లో ఉన్న వారి వాహనాలతో సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.