తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 4 ప్రజా పథకాలను గ్రామాల వారీగా అమలు చేయడానికి షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. రాష్ట్రంలోని 12,845 గ్రామాల్లో 563 గ్రామాల్లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం, మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో పథకాలను పూర్తి చేయనున్నట్లు తెలిపింది.
గ్రామాల వారీగా రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్ట్‌లను ఫైనల్ చేస్తున్నారు. గృహ నిర్మాణ, వ్యవసాయ, పంచాయతీరాజ్ మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనులు చేపట్టనున్నాయి. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 6,000 చొప్పున మొదటి విడత సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే విధంగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ. 12,000 చొప్పున నిధులు అందజేయనున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయనున్నారు. మార్చి 31 వరకు ఈ పథకాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.