ప్రజలకు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సూచన

భయపెట్టే, ఆందోళన కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండమని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు సూచించారు. కరోనా వైరస్‌, దాని గురించి వస్తోన్న వార్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ట్వీట్లు చేశారు. భౌతికదూరం, పరిశుభ్రతతోపాటు మరొకటి పాటించాలని నెటిజన్లను కోరారు.

‘దీన్ని ప్రతిఒక్కరు చదవాలని.. ప్రేమ, ఆశల్ని, పాజిటివిటీని వ్యాప్తి చేయాలని కోరుతున్నా. మనమంతా కలిసి ఈ తుపానుతోపాటు ప్రయాణం చేస్తున్నాం. దూరం (social distancing) పాటించడం, పరిశుభ్రంగా ఉండటంతోపాటు (good hygiene) మరో ముఖ్య విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే భయాన్ని దూరంగా ఉంచడం (Fear Distancing).. ఆందోళన, భయాన్ని కలిగించే వ్యక్తులకు, వార్తలకు దూరంగా ఉండండి. తప్పుడు వార్తలు పెద్ద సమస్యగా మారాయి. తప్పుదారిపట్టించే సమాచారానికి దూరంగా ఉండండి’.

‘లాక్‌డౌన్‌ విధించి రెండు వారాలు అవుతోంది. మనం చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. ఐకమత్యంగా పనిచేస్తోన్న మన ప్రభుత్వాలను ప్రశంసించాలి. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈ సందర్భంగా మనమంతా ఆరోగ్యంగా ఉండేందుకు కొవిడ్‌-19తో పోరాడుతూ ముందు వరసలో నిల్చున్న వారికి ధన్యవాదాలు చెబుదాం. వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి మన కోసం పోరాడుతున్న యోధులను గౌరవిద్దాం. మీ అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి’ అని మహేశ్‌ ట్వీట్లు చేశారు.