రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ విక్రయ సంస్థ మెడ్‌ప్లస్..వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఈ ఐపీవో ద్వారా రూ.700 కోట్ల వరకు నిధులను సేకరించాలనుకుంటున్నట్లు కంపెనీ ప్రమోటర్ మధుకర్ గంగాడి తెలిపారు. ప్రస్తుతం ఏడు రాష్ర్టాల్లో 1,700 రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న సంస్థ..2023 నాటికి ఈ సంఖ్యను 3,100కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. నూతనంగా ఏర్పాటు చేసే అవుట్లెట్లలో తెలుగు రాష్ర్టాల్లోనే 500 నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. కెనడాకు చెందిన జెమిసన్స్ వెల్నెస్కు చెందిన నేచురల్ హెల్త్ ఉత్పత్తులను దేశీయంగా విక్రయించడానికి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1,700 రిటైల్ అవుట్లెట్లలో జెమిసన్స్కు సంబంధించిన మల్టీ విటమిన్స్, బీ-కాంప్లెక్స్, విటమిన్ సీ, విటమిన్ డీ, క్యాల్షియం వంటి 300 ఔషధాలు మెడ్‌ప్లస్ రిటైల్ అవుట్లెట్లలో లభించనున్నాయి.
ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 500 రిటైల్ అవుట్లెట్లను కలిగివున్నది. జమ్ము అండ్ కశ్మీర్, ఉత్తర భారతం మినహా దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఐపీవోకి సంబంధించి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. 2013 నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఐపీవో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాటాలను విక్రయించడం ద్వారా సేకరించిన నిధులను రుణాలను తీర్చడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి వినియోగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సంస్థలో ప్రమోటర్లు 77 శాతం వాటా కలిగివుండగా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీకి 13 శాతం, మిగతా పది శాతం ఇతరులకు ఉన్నది. వచ్చే మార్చి నాటికి రూ.2,800 కోట్ల ఆదాయంపై రూ.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉన్నదని ఆయన వెల్లడించారు. గతేడాది రూ.2,250 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.