ప్రముఖ భారత హార్ట్ సర్జన్ డా. కే.ఎం. చెరియన్ (82) శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగళూరులో ఓ పెళ్లికి హాజరైన సమయంలో తలనొప్పి, అస్వస్థతతో బాధపడిన ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11:55 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె సాంధ్యా చెరియన్ తెలిపారు.
డా. చెరియన్ భారత వైద్యరంగంలో కీలకమైన కరోనరీ ఆర్టెరీ బైపాస్ సర్జరీని 1975లో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించారు. దేశంలోనే మొదటి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, పీడియాట్రిక్ హార్ట్ సర్జరీలు నిర్వహించిన ఘనత ఆయనకు చెందింది.
వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేసిన చెరియన్, తర్వాత చెన్నైలోని విజయా హాస్పిటల్, మద్రాస్ మెడికల్ మిషన్, ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ హాస్పిటల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థాపించిన డాక్టర్ కే.ఎం. చెరియన్ హార్ట్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అనేక సేవలను అందించింది.
అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఉన్న మెడికల్ సంస్థలతో ఆయనకు అనుబంధం ఉంది. వైద్యరంగంలో ప్రఖ్యాత సేవలకుగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
డా. చెరియన్ మృతిపై పలువురు వైద్యులు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.