సుకుమార్ .. మహేశ్ బాబు మూవీకి విజయేంద్రప్రసాద్ కథ?

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సుకుమార్ వినిపించిన కథ పట్ల మహేశ్ బాబు పెద్దగా ఆసక్తిని కనబరచలేదట. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో సుకుమార్ సినిమా ఉంటుందా? లేదా? అనే సందేహం అందరిలోనూ మొదలైంది.
అయితే ఎరోస్ సంస్థ వారు వరుస సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో, రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కొన్ని కథలను రాయించుకుని సిద్ధంగా ఉన్నారట. అందులో ఒక కథను సుకుమార్ దర్శకత్వంలో .. మహేశ్ హీరోగా చేయాలనుకుంటున్నారని టాక్. ఈ కథ కూడా మహేశ్ బాబు వినవలసి వుంది. ఒకవేళ మహేశ్ బాబు వినేసి ఓకే చెప్పేసినప్పటికీ సుకుమార్ అంగీకరిస్తాడా? అనేదే సందేహం. తను రెడీ చేసిన కథలనే తెరకెక్కిస్తూ వస్తోన్న సుకుమార్, ఎరోస్ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంటాడా? అనేది వేచి చూడాలి.