సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం జేసీ ఏం చెప్పారంటే..

Image result for Jc diwakar reddy ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాను. ఇప్పుడు అంతా ఆల్‌ రైట్’’ అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ.. ఈ దేశంలో ఎవరి మీదా అలగలేమని, అలిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. తాను ఎవరి మీదో అలిగి పార్లమెంటుకు వెళ్లలేదనేది నిజం కాదని దివాకర్‌రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసి అంతా వివరించానని, అయితే ఆయనతో ఏం మాట్లాడాననే విషయాన్ని బయటకు చెప్పనన్నారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం బాగాలేదని, రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని జేసీ స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదాపై సీడబ్ల్యూసీ తీర్మానం ఒట్టిమాటేనని జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ, మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం విడ్డూరమని జేసీ అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు హామీలు అమలు కావని, అయినా పోరాటం కొనసాగాల్సిందేనని జేసీ దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ‘మీరు హ్యాపీగా ఉంటే.. నేను హ్యాపీగా ఉంటా’నని చెబుతూ.. పార్లమెంటుకు వెళతానని హింట్ ఇచ్చారు.