‘సాహో’ టీజర్‌ వచ్చేసింది

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లలో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. ‘బాధైనా హ్యాపీనెస్‌ అయినా నాతో షేర్‌ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు’ అంటూ కథానాయిక శ్రద్ధా కపూర్‌ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందుకు ప్రభాస్‌. శ్రద్ధను ఆలింగనం చేసుకుని ‘నేనున్నాను’ అని చెప్పడం ఆకట్టుకుంటోంది. యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. టీజర్‌ చివర్లో దుండగుల నుంచి ప్రభాస్‌, శ్రద్ధ తప్పించుకుని ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రద్ధ ‘ఎవరు వీళ్లు’ అని ప్రభాస్‌ను అడుగుతారు. ఇందుకు ప్రభాస్‌.. ‘ఫ్యాన్స్‌’ అని సమాధానమిస్తారు. ఆ తర్వాత శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ అని అడగ్గా.. ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ అని ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌ రైట్స్‌ దాదాపు రూ.42 కోట్లకు అమ్ముడుపోయాయట. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.