వొడాఫోన్‌ ఐడియా.. ఇక ‘వి’

వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తన బ్రాండు పేరును ‘వి’ (విఐ)గా మార్చుకుంది. సోమవారం దృశ్యశ్రవణ మాధ్యమం (వర్చువల్‌) ద్వారా ఈ కొత్త బ్రాండును ఆవిష్కరించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఈ టెలికాం సంస్థకు.. ఏజీఆర్‌ బకాయిలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్‌ ఐడియా తనను తాను పునర్నిర్మాణం చేసుకోవడంపై దృష్టి సారించింది. తద్వారా ఇప్పటివరకు తాను కోల్పోయిన మార్కెట్‌ వాటాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియాకు 28 కోట్ల మంది చందాదార్లు ఉన్నారు. ఇక నుంచి వొడాఫోన్‌, ఐడియా బ్రాండ్లను ‘వి’గా వ్యవహరించాలని కంపెనీ తెలిపింది. ఈ రెండు బ్రాండ్ల అనుసంధానంతో ప్రపంచ టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియ పూర్తయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది.