వృద్ధి రేటు అంచనాల్లో ఫిచ్‌ భారీ కోత!

ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాల్లో భారీ కోత విధించింది. దాదాపు 10.5 శాతం మేర కుచించుకుపోనుందని అంచనా వేసింది. గతంలో ఇదే కాలంలో జీడీపీ 5 శాతం కుంగొచ్చని తెలిపిన సంస్థ.. మహమ్మారి విజృంభణ, దాని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మరింత కోత విధించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదైన దేశాల్లో భారత్‌ ఒకటని తెలిపింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. సెప్టెంబరు నెలకు సంబంధించి విడుదల చేసిన గ్లోబల్‌ ఎకానమిక్‌ ఔట్‌లుక్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ప్రపంచంలో యూకే, స్పెయిన్‌, భారత్‌లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా, కొనుగోళ్లపై భారీ ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది.