వాజ్‌పేయీ ఎందుకు వివాహం చేసుకోలేదంటే..!

కురు వృద్ధుడు, కురు పితామహుడు భీష్మాచార్యుడు ఎంతటి రాజనీతిజ్ఞుడో అందరి తెలిసిందే. చాలా విషయాల్లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కూడా ఆయనకు ఏమాత్రం తీసిపోరు. భీష్మ ప్రతిజ్ఞ చేసి, బ్రహ్మచారిగా ఉండిపోయి, అనన్యకీర్తిని సంపాదించాడు ద్వాపరయుగ భీష్ముడు. నేటి అభినవ భారతంలోనూ బ్రహ్మచారిగా ఉండిపోయి, వాజ్‌పేయీ అలాంటి ఖ్యాతినే పొందారు. అయితే, మీరెందుకు వివాహం చేసుకోలేదని ఓసారి వాజ్‌పేయీని ప్రశ్నించగా, ఆయన సమాధానం అందరినీ ఆశ్చర్య పరిచింది.
‘నాకు వివాహం చేసుకునేంత సమయం లభించలేదు. బాధ్యతలు లేని జీవితం గడుపుతున్నా’ అని తన కవితాత్మక ధోరణిలో చెప్పుకొచ్చిన వాజ్‌పేయీ తన జీవితంలో అత్యంత బాధ కలిగించిన సందర్భం ఏందంటే.. అయిదో తరగతిలో తన ఉపాధ్యాయురాలు చెంపపై కొట్టడమేనని చెబుతారు.
వాజ్‌పేయీ వివాహం చేసుకోకపోవడానికి రాజకీయ పండితులు మరో కారణం కూడా చెబుతారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా పనిచేసిన ఆయన.. పనినే దైవంగా భావించేవారట. వివాహం చేసుకుంటే ప్రచారక్‌గా తన విధులను సరిగా నిర్వర్తించలేనేమోనని భావించే వాజ్‌పేయీ పెళ్లి చేసుకోలేదని పేర్కొంటారు. ఒక సందర్భంలో మీరు ఎందుకు వివాహం చేసుకోలేదని అడిగితే.. ‘నాకు తగిన అమ్మాయి దొరకలేదు’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారట.