వన్‌ప్లస్‌ మొబైల్ అదుర్స్‌

భారతదేశపు మొబైల్‌ విపణిలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్‌ అదరగొట్టింది. ప్రీమియం సెగ్మెంట్‌ మోడళ్లలో యాపిల్‌, శాంసంగ్‌ను దాటేసి అత్యధిక షిప్‌మెంట్‌ (ఎగుమతులు లేదా దిగుమతులు) షేర్‌ ఉన్న కంపెనీగా అగ్రస్థానంలో వన్‌ప్లస్‌ రికార్డు నమోదు చేసుకున్నది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోకి దిగుమతి అయిన మొత్తం ప్రీమియం ఫోన్లలో 43 శాతం వన్‌ప్లస్‌వే అని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజాగా వెల్లడించింది.

ఈ జాబితాలో 22శాతం షేర్‌తో దక్షిణకొరియా దిగ్గజ మొబైల్‌ సంస్థ శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. 18 శాతం షేర్‌తో యాపిల్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక వన్‌ప్లస్‌ నుంచి వచ్చిన ఆల్ట్రా ప్రీమియం ఫోన్‌ వన్‌ప్లస్‌ 7 ప్రోకు భారత మార్కెట్లో విశేషాదరణ లభిస్తోంది. దిగుమతి అయిన మొత్తం వన్‌ప్లస్‌ ఫోన్లలో 26 శాతం 7ప్రో మోడల్‌ ఫోన్లే అని కౌంటర్‌పాయింట్‌ పేర్కొంది. ఇక శాంసంగ్‌లో ఎక్కువగా ఎస్‌10 ప్లస్‌ ఫోన్లు దిగుమతి అయినట్లు తెలిపింది. ఈసారి తాజా గా మార్కెట్లోకి షావోమీ, ఒప్పో, వివో, హువావే కూడా ప్రీమియం సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడంతో పోటీ విపరీతంగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది.