ఎన్జీవో అంటే మనకు తెలిసింది? స్కూల్స్‌లో విద్యార్థులకు పుస్తకాలు, ఉపకార వేతనాలు అందించడమో లేక మరుగుదొడ్లు కట్టించడమో! లేకపోతే చెత్తచెదార ప్రాంతాలను శుభ్రం చేయడం, వైద్య శిబిరాలు, మందులను పంపిణీ చేయడమో. అంతే కదా! కానీ, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ మాత్రం కాస్త డిఫరెంట్. అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందించడం, ఈ–లెర్నింగ్‌తో యువత, విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ, జాతీయ స్థాయిలో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రతిభను వెలికితీయడం దీని ప్రత్యేకత! ప్రస్తుతం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్టౌన్కు చిన్నం మధుబాబు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
సమాజంలో అవసరం ఉన్న ప్రతి చోట రోటరీ విజయవాడ మిడ్‌టౌన్ ప్రత్యక్షమవుతుంది. మతం, కులం, రంగు, ప్రాంతం, లింగబేధం వంటి తారతమ్యాల్లేకుండా సమాజ సేవనే పరమావధిగా పాటిస్తుంది. పోలియో నిర్మూలన కోసం రోటరీ ఇంటర్నేషనల్‌లో ఇప్పటివరకు రూ.12 వేల కోట్లను ఖర్చు చేసింది. విజయవాడ మిడ్‌టౌన్‌లో వ్యాపారస్తులు, వైద్యులు, న్యాయవాదులు, చార్డర్డ్ అకౌంటెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని అధికారులు సభ్యులుగా ఉన్నారు.


ఈ ఏడాది లక్ష్యాలివే..
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఈ ఏడాది రూ.2 కోట్ల ఖర్చుతో పలు సేవా కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా అందని నిస్సహాయులను ఎంపిక చేసి ప్రతి నెలా పది మందికి రూ.1,000 పెన్షన్స్ అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కొన్ని వేల మంది విద్యార్థులకు న్యూ జనరేషన్ ప్రొగ్రామ్స్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ, 25 పాఠశాలల్లో ఈ–లెర్నింగ్ సిస్టమ్స్, 150 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఎంపిక చేసిన ఆరు గ్రామాల్లో వొకేషనల్ ట్రెయినింగ్ సెంటర్ల ఏర్పాటు వంటివి చేయాలని లక్ష్యించింది.
రికార్డులోకి ఎక్కిన మిడ్‌టౌన్..
వ్యాపారవేత్తలు, ప్రొఫిషనల్స్‌ను ఒకే వేదికి తీసుకొచ్చి వ్యాపారాభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో 1905లో రోటరీ ఇంటర్నేషనల్ ప్రారంభమైంది. అమెరికా కేంద్రంగా పాల్ పీ హారీస్ తొలి రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్‌ను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో రోటరీ క్లబ్స్ ఉన్నాయి. 12 లక్షల మంది సభ్యులున్నారు. రోటరీ ఇంటర్నేషనల్ అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్‌లో అత్యధిక సభ్యులున్న రోటరీ క్లబ్‌గా మిడ్‌టౌన్‌లో రికార్డుల్లోకి ఎక్కింది. 1984 డిసెంబర్ 12న రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఏర్పాటైంది. 1985 ఏప్రిల్ 24న 33 మంది సభ్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇందులో 720 మంది సభ్యులున్నారు.
స్కూల్స్, ఆసుపత్రులు, గ్రామాలు..
గత నాలుగేళ్లలో విజయవాడ మిడ్‌టౌన్ సభ్యులు రూ.5.40 కోట్లను కాంట్రిబ్యూట్ చేశారు. గతంలో చేసిన సేవల్లో కొన్ని..
– గొల్లపూడిలోని తుమ్మలపాలెం గ్రామాన్ని విజయవాడ మిడ్‌టౌన్ దత్తత తీసుకుంది. కోటి రూపాయల ఖర్చుతో గ్రామంలో సౌర విద్యుత్ దీపాలు, సిమెంట్ బెంచీలు, కమ్యూనిటీ హాల్‌ను నిర్మించారు. అలాగే గ్రామంలోని ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేందుకు నాలుగు ఆటోరిక్షాలను ఏర్పాటు చేశారు.
– రూ.20 లక్షల వ్యయంతో అప్పారావ్పేటలో వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటూ గ్రామంలోని ప్రతి ఇంటికీ పైప్లైన్స్ను అనుసం«ధానించి సుమారు 400ల కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందజేశారు.
– నిరుపేదలు, అనాథలు మరణిస్తే దహన సంస్కారాలు నిర్వహించేందుకు రూ.7.50 లక్షలతో స్వర్గరోహణ రథం (టాటా 407) వాహనాన్ని ఏర్పాటు చేశారు.
– రూ.4 లక్షల ఖర్చుతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. మిడ్‌టౌన్ హాస్పిటల్ అండ్ సర్వీస్ ట్రస్ట్‌ను మూడేళ్ల నుంచి ఆసుప్రతిని మిడ్‌టౌన్ నిర్వహిస్తుంది.
– మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు, నిర్వహణతో పాటూ వివిధ ప్రాంతాల్లో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు కూడా మిడ్టౌన్దే.
– 106 మున్సిపల్ పాఠశాలల్లో వాటర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుతో పాటూ రూ.1.85 కోట్ల వ్యయంతో విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బెంచీలను ఏర్పాటు చేశారు. పలు పాఠశాలలు, కాలేజీల్లో మెడికల్ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేశారు.