రెండో రోజు చంద్రబాబు, జగన్‌ మధ్య మాటల యుద్ధం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు వ్యక్తిగత దూషణలకు దిగాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో వేడి పెరిగింది. 23 మంది వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని  సీఎం జగన్‌ ఘాటుగా విమర్శించారు. ‘‘ముగ్గురు ఎంపీలను ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది. ప్రజలు గూబ గుయ్యి మనేటట్టు కొట్టారు. అన్యాయం చేసిన వాళ్లకు అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే ముగ్గురు ఎంపీలు గెలిచారు. అది కూడా 23వ తేదీనే తీర్పు ఇచ్చారు. దేవుడు తీర్పు ఇచ్చాడు.  నేను కూడా చంద్రబాబు మాదిరిగా ఆలోచించి ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదు. నాతో ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెప్పాలా..?  నేను ఏ విధంగా విలువలు పాటించానో అందరికీ తెలుసు. నేను కూడా ప్రలోభ పెడితే ఎంతమంది మిగులుతారో చూస్తాను. ఈ అన్యాయమైన సంప్రదాయానికి స్వస్తి పలకాలి, అసెంబ్లీలో మంచి సంప్రదాయం రావాలి’’ అని జగన్‌ అన్నారు.