- మే నెలలో 2.45 శాతం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ దాదాపు రెండేళ్ల (22 నెలలు) కనిష్ఠ స్థాయికి జారుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 3.07 శాతంగా నమోదైన టోకు ద్రవ్యోల్బణం ఈ ఏడాది మే నెలలో 2.45 శాతానికి తగ్గింది. 2017 జూలైలో 1.88 శాతం వద్దనున్న సూచీకి ఆ తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. ఆహారోత్పత్తులు, ఇంధనం, విద్యుత్ టోకు ధరలు తగ్గడం ఇందుకు దోహదపడింది. ఏప్రిల్లో 7.37 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల.. మే నెలలో 6.99 శాతానికి పరిమితమైంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల మాత్రం -3.43 శాతం నుంచి 15.89 శాతానికి ఎగబాకింది. పప్పు దినుసుల విభాగంలో ధరల వార్షిక పెరుగుదల వరుసగా నాలుగు నెలల నుంచి రెండంకెల్లో నమోదవుతోంది. ఏప్రిల్లో 14.32 శాతంగా నమోదుకాగా.. గతనెలలో 18.36 శాతానికి ఎగబాకింది. గతనెలలో ఆహార, ఇంధనయేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం (కోర్ ఇన్ఫ్లేషన్) 29 నెలల కనిష్ఠ స్థాయి 1.2 శాతానికి పడిపోయింది. మార్కెట్లో వస్తు వినిమయ డిమాండ్ బలహీనంగా ఉందనడానికిది స్పష్టమైన సంకేతమని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రధాన ఆర్థికవేత్త సునీల్ కుమార్ సిన్హా అన్నారు. ఆటో, ఎఫ్ఎంసీజీ విక్రయాలు గత కొద్ది నెలలుగా ఇదే సంకేతమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలకరి ఇప్పటికే ఆలస్యం కావడంతోపాటు ఈసారి సాధారణ స్థాయి కంటే త క్కువ వర్షపాతం నమోదుకావచ్చన్న అంచనాల నేపథ్యంలో మున్ముందు నెలల్లో ఆహార ధరలు ఎగబాకే ప్రమాదం ఉందని సిన్హా హెచ్చరించారు. మార్కెట్లో ధరల స్థిరీకరణకు ప్రభు త్వం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవస రం ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది.