రికార్డు స్థాయికి చేరువలో విదేశీ మారక నిల్వలు

భారత్‌ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరువలో ఉన్నాయి. జూన్‌7తో ముగిసిన వారానికి ఈ నిల్వలు 168.6 కోట్ల డాలర్లు పెరిగి 42,355.4 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇంతకు ముందు 2018 ఏప్రిల్‌లో జీవిత కాల గరిష్ఠ స్థాయిలో విదేశీ మారక నిల్వలు 42,602.8 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఇప్పుడీ స్థాయి సమీపానికి మారక నిల్వలు చేరుకున్నాయి. కాగా సమీక్షా వారంలో బంగారం నిల్వలు 2,295.8 కోట్ల డాలర్ల వద్ద యథాతథంగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద భారత్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 61 లక్షల డాలర్లు పెరిగి 144.9 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. అదే విధంగా ఐఎంఎఫ్‌ వద్ద నిల్వలు 1.4 కోట్ల డాలర్లు పెరిగి 333.45 కోట్ల డాలర్లకు చేరాయని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది.