రామ రాజ్యమంటే ఏంటో నా సినిమాలో చూపిస్తాను: కంగన

దేశ ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అపురూప ఘట్టం నేడు నిజమయ్యింది. రామ మందిర నిర్మణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పరస్పర ప్రేమ, సోదరభావం మీద మందిర నిర్మాణం జరగనున్నట్లు ప్రకటించారు. నేటి చారిత్రత్మాక సంఘటనపై నటి కంగనా రనౌత్‌ స్పందించారు. దేశ చరిత్రలో ఇది ఒక మరపురాని సంఘటన అన్నారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘మందిరం అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. అయోధ్య నాగరికతకు ప్రతీక. దీనికి 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది. మందిరం అంటే కేవలం స్తంభాలు, ఇటుకలతో కూడిన ఓ నిర్మాణం కాదు. ఇది మన నాగరికతను ఉన్నతంగా చూపే ఓ చిహ్నం. రాముడు అంటే దేవుడు కాదు. పురుషోత్తముడు. ఒక మహోన్నత వ్యక్తి. అతడు లేకపోయినా.. ఆయన గుణాలు నేటికి జనాలు పాటిస్తున్నారు. ఈ ఆలయం వాటికి చిహ్నం. రామ రాజ్యాన్ని స్థాపించాడు.. దానిని చాలావరకు మహాత్మా గాంధీ అనుసరించారు. ఆ దారిలోనే మనకు స్వేచ్ఛను సంపాదించారు’ అని తెలిపారు కంగనా.
అయోధ్య రామ మందిరానికి దాదాపు 600 వందల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని తన మణికర్ణిక బ్యానర్‌లో కంగనా ‘అపరాజిత అయోధ్య’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఇందుకు సంబంధించిన కథను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘నా చిత్రంలో రామ మందిరానికి అనుకూలంగా వ్యవహరించిన ముస్లింలను చూపించబోతున్నాను. ఈ చిత్రంలో దైవం, నమ్మకం అన్నింటికి మించి దేశ ఐక్యతను చూపించబోతున్నాం. కులమతాలకు అతీతమైనది రామ రాజ్యం. అది ఎలా ఉంటుందో మా చిత్రంలో చూపిస్తాం. సినిమాకు సంబంధించిన లోగోను లాంచ్‌ చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్నాం’ అన్నారు కంగనా. అపరాజిత అయోధ్య చిత్రం గురించి ఈ ఏడాది ప్రారంభంలోనే కంగనా ప్రకటన చేశారు. ఈ చిత్రానికి తనే నిర్మత, దర్శకురాలు కూడా.