రాముడి దెబ్బ‌కు శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థానానికి క‌త్తి

శ్రీ‌రాముడి దెబ్బ‌కు సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్ శ్రీ‌కృష్ణుడి జన్మ‌స్థానానికి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. సోష‌ల్ మీడియాలో రాముడిపై వివాదాస్ప‌ద కామెంట్స్ చేయ‌డంతో క‌త్తి మ‌హేశ్‌పై పోలీసులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. క‌త్తి మ‌హేశ్ పోస్టుల‌పై ప‌లు హిందూ సంఘాలు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదులు చేశాయి.

దీంతో క‌త్తి మ‌హేశ్‌పై ఐపీసీ సెక్ష‌న్ 153 ఎ క‌మ్యూన‌ల్ యాక్ట్ కింద సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప‌లు ద‌ఫాలుగా విచార‌ణ అనంత‌రం క‌త్తిని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఆయ‌న‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

కాగా గ‌తంలో ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో ఆయ‌న మాట్లాడుతూ రాముడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచారంటూ ప‌లు హిందూ సంఘాలు అప్ప‌ట్లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. దీంతో తెలంగాణ పోలీసులు ఆయ‌న‌పై హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేశాయి. బ‌హిష్క‌ర‌ణ కాలం ముగియ‌డంతో య‌ధా ప్ర‌కారం ఆయ‌న మ‌ళ్లీ హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవ‌ల ఆర్జీవీ తెర‌కెక్కించిన ప‌వ‌ర్‌స్టార్ సినిమాలోనూ, నూత‌న్‌నాయుడు అందుకు కౌంట‌ర్‌గా తీసిన ప‌రాన్నజీవి చిత్రంలోనూ క‌త్తి మ‌హేశ్ న‌టించ‌డం విశేషం.