మోజంజాహి.. కొత్తగా!

హైదరాబాద్‌కు ఐకానిక్‌గా నిలిచే కట్టడాల్లో ఒకటైన మోజంజాహి మార్కెట్‌.. కొత్త సొబగులు అద్దుకుని, మళ్లీ జిగేల్మంటున్నది. తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ మురిసిపోతున్నది. దాదాపు 85 ఏండ్ల కిత్రం నిర్మితమైన మోజంజాహి మార్కెట్‌ను ఇటీవలే పునరుద్ధరించారు. దానిని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌లోని చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. పూర్వస్మృతులకు సజీవంగా నిలిచిన మోజంజాహి మార్కెట్‌ పాత కొత్తల కలయికగా హైదరాబాద్‌లో నిలిచిందని అభివర్ణించారు. నిజాం నవాబుల చరిత్రకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. హైదరాబాద్‌ ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా సర్వాంగ సుందరంగా రూ.15 కోట్లతో పునరుద్ధరించినట్లు చెప్పారు. ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఆకర్షించేలా క్లాక్‌టవర్‌ను తీర్చిదిద్దామన్నారు. ఈ ప్రాంగణంలో వంద ఫీట్ల భారత జాతీయ జెండాను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎగుర వేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలోని మయూర హోటల్‌తో సీఎం కేసీఆర్‌కు అనుబంధం ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు హెరిటేజ్‌ హోదా రావాలని ఆకాంక్షించారు. వెయ్యి కోట్లతో యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. చరిత్ర ప్రియులు, నగర వాసులు ఈ ప్రాంగణాన్ని సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. మోజంజాహి మార్కెట్‌ సముదాయాన్ని రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యేటీ రాజాసింగ్‌, నగర మేయర్‌ బొంతు రాంమోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తదితరులతో కలిసి పర్యటించిన కేటీఆర్‌.. మార్కెట్‌ చరిత్రను తెలిపే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నందకిషోర్‌ వ్యాస్‌తో పాటు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.