మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కూల్ 3 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ టెక్నాలజీ..భారత్‌లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడానికి భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. వచ్చే ఐదేండ్లకాలంలో 500 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.3,500 కోట్లకు పైమాటే. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, అమ్మకాలను పెంచడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు కూల్‌ప్యాడ్ టెక్నాలజీస్ ఇండియా సీఈవో ఫిషర్ యువన్ తెలిపారు. దేశీయ మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ కూల్ 3 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల కార్యక్రమంలో ఆయన భవిష్యత్తు పెట్టుబడులను ప్రకటించారు. ఎనిమిది నెలల తర్వాత తిరిగి ఆన్‌లైన్లో విక్రయాలను ప్రారంభించిన సంస్థ..బుధవారం విడుదల చేసిన రూ. 5,999, రూ.6,499 విలువైన స్మార్ట్‌ఫోన్లు కూడా ఆన్‌లైన్లో మాత్రమే లభించనున్నాయన్నారు. ఇప్పటికే దేశీయంగా పదిలక్షల మొబైళ్లను విక్రయించిన సంస్థ..ఆన్‌లైన్ సంస్థ అమెజాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఈ ఏడాది చివరినాటికి విక్రయాలు 30 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. 5.71 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా, మీడియా టెక్ 6761, క్వాడ్ కోర్ 2.0 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ ఫోను రెండు రకాల్లో లభించనున్నది. వీటిలో 2జీబీ ర్యామ్ కలిగిన ధర రూ.5,999గా నిర్ణయించిన సంస్థ, 3జీబీ ర్యామ్ మొబైల్‌ను రూ.6,499కి విక్రయిస్తున్నది.