మాక్స్‌క్యూర్‌ ఇక మెడికవర్‌ హాస్పిటల్

సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందించే మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ పేరు మెడికవర్‌ హాస్పిటల్స్‌గా మారింది. స్వీడన్‌ వైద్య సేవల కంపెనీ మెడికవర్‌.. 2017లో మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌కు చెందిన 51 శాతం వాటాను రూ.320 కోట్లకు దక్కించుకుంది. దాంతో మెడికవర్‌ గూటిలోకి వెళ్లిన మాక్స్‌క్యూర్‌ తాజాగా బ్రాండ్‌నేమ్‌ను కూడా మార్చుకుంది. మాక్స్‌క్యూర్‌ హాస్పిటళ్లను ఇకపై తన బ్రాండ్‌నేమ్‌తో నిర్వహించడం ద్వారా భారత హెల్త్‌కేర్‌ రంగంలోకి మెడికవర్‌ పూర్తి స్థాయి రంగ ప్రవేశం చేస్తోంది. గతంలో ఈ సంస్థ ఢిల్లీలో ఫెర్టిలిటీ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ గ్రూపును డాక్టర్‌ అనిల్‌ కృష్ణ 2011లో ప్రారంభించారు. గడిచిన ఎనిమిదేళ్లలో వేగంగా వృద్ధి చెందుతూ వచ్చిన ఈ గ్రూపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల్లో 11 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్వహిస్తోంది.