మహేశ్ బాబు ‘హంబుల్‌’ బ్రాండ్ లాంచ్

వరుస విజయాలతో దూకుడు మీదున్న టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపారరంగంలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు.  ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హంబుల్ బ్రాండ్ దుస్తులను పార్క్ హయత్‌లో బుధవారం అట్టహాసంగా ఆవిష్కరించారు. స్పోయల్ సంస్థతో కలిసి హంబుల్ బ్రాండ్ పేరుతో 160 రకాల దుస్తులను వినియోగదారుల అందుబాటులోకి  తెచ్చారు. యువకుల నుంచి వృద్ధుల దాకా ఆకర్షణీయంగా, అందుబాటు ధరలో క్యాజువల్ షర్ట్స్ , టీ-షర్టులను అందిస్తోంది.

కాగా  ‘ది హంబుల్ కో’ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగిడుతున్నట్టు ఇటీవల మహేష్‌ బాబు ట్విటర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆగస్టు 7న అధికారికంగా ప్రారంభం కానందని ట్వీట్‌ చేశారు.  ఇప్పటికే సొంత బ్యానర్ ప్రారంభించి, భారీ మల్టిప్లెక్స్ థియేటర్‌తో అభిమానులను ఆకట్టుకున్న మహేష్‌ బాబు  “ది హంబుల్ కో ” పేరుతో  తాజాగా బ్రాండెడ్ వస్త్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. సినిమాలు, యాడ్స్‌తో క్షణం క్షణం తీరికలేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న రీల్‌ బిజినెస్‌మేన్‌ మహేష్‌ రియల్‌ బిజినెస్‌మేన్‌గా మరోసారి ఖలేజా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.