ఫ్యాన్స్‌కు రజనీకాంత్‌ భారీ షాక్‌

అభిమానులకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ భారీ షాకే ఇచ్చారు. రాజకీయాలపై దృష్టిసారించిన ఆయన త్వరలో పార్టీ ఏర్పాటును ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు ఝలక్‌ తగిలినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున సీట్లు ఆశించొద్దనే ఆయన అభిమాన సంఘాలకు స్పష్టం చేశారంట. ఈ విషయాన్ని రజనీ ఫ్యాన్స్‌ క్లబ్‌ ప్రతినిధి ఒకరు శనివారం ధృవీకరించగా.. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది. ‘ఈ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారు. సుదీర్ఘంగా అభిమానులుగా ఉన్నవాళ్లు, ఫ్యాన్స్‌ కమిటీ చైర్మన్లు, ఫ్యాన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్లు టికెట్లు ఆశించొద్దని మొన్నీమధ్య జరిగిన సమన్వయ కమిటీలో రజనీ తేల్చి చెప్పారు. అయితే ఈ నిర్ణయంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. దీనిపై త్వరలో చర్చించాలని భావిస్తున్నాం’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు.

అయితే రజనీ మక్కల్ మంద్రం మాత్రం మరోలా చెబుతోంది. ‘అంతిమ నిర్ణయం రజనీదే. రాజకీయాలు వేరు.. అభిమానం వేరు’ అని మక్కల్‌ సంఘం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే స్పష్టత ఇవ్వని రజనీ.. సీట్ల పంపకం గురించి ఇప్పుడిప్పుడే ఆలోచించకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్షన్‌లో తీస్తున్న ఓ చిత్రం రజనీ నటిస్తుండగా, రోబో 2.0 నవంబర్‌లో రిలీజ్‌ కానుంది.