ప్రముఖ సాహితీవేత్త తిరునగరికి (ఆలేరు) దాశ‌ర‌థి అవార్డు

రాష్ర్టానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అంద‌జేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక‌ను అంద‌జేసి శాలువాతో రామానుజ‌య్య‌ను సీఎం స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దాశరథి పురస్కారం పొందడానికి రామానుజం వందకు వందశాతం అర్హుడని సీఎం అన్నారు. ఆయన రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ప్రజా ఆదరణ పొందాయన్నరు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితివేత్తగా రామానుజం నిలుస్తారని సీఎం కేసీఆర్ అభినందించారు. అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పాడి వినిపించిన పద్యం అందరినీ ఆకట్టుకున్నది.

ఐదున్నర దశాబ్దాల సాహితీ సేవ
తిరునగరి రామానుజయ్య ఐదున్నర దశాబ్దాలుగా సాహితీరంగానికి ఎనలేని సేవచేస్తున్నారు. 1945లో యాదాద్రి భువనగిరి జిల్లా బేగంపేటలో జన్మించిన ఆయన.. ఆలేరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. మూడు దశాబ్దాలపాటు ఉపాధ్యాయుడిగా, లెక్చరర్‌గా బోధనారంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 30కిపైగా గ్రంథాలు రాశారు. అటు ప్రాచీన సాహిత్యానికి ఇటు ఆధునిక కవిత్వానికి వా రధిలా నిలిచారు. తిరునగరి సాహితీవేత్తగానే కాకుం డా.. తెలుగు, సం స్కృతం, హిందీ, ఇంగ్లిషు ప్రసంగాల ద్వారా గొప్పవక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. కవిత్వం, పద్యం, విమర్శ, వ్యాఖ్యానం ఏదిరాసినా తనదైన శైలి క నబర్చారు. ఆయన ఆకాశవాణి, దూరదర్శన్‌కు వందల లలిత, ప్రభోదాత్మ క, దేశభక్తి గీతాలను రాశారు. అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. పలు సంస్థలు నిర్వహించిన సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడిగా ఉన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రముఖ సాహితీ పురస్కారాలు అందుకున్నారు.