ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీఎం కేసీఆర్

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగరేశారు. కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో ఈసారి నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయగా.. ఈ వేడుకల్లో అతి కొద్ది మంది నేతలు, అధికారులు మాత్రమే పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేశవ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమర వీరుల స్థూపం ముందు పుష్ఫ గుచ్ఛం ఉంచిన సీఎం.. అమర వీరులకు నివాళులు అర్పించారు. సాధారణంగా గోల్కొండ కోట వద్ద సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగరేస్తారు. కానీ ఈసారి కరోనా ప్రభావంతో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్‌లో ఈ వేడుకలను నిర్వహించారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. కాగా కోవిడ్ నేపథ్యంలో ఈసారి వర్చువల్‌గా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు.