పవన్‌ కల్యాణ్‌పై వర్ల రామయ్య సెటైర్లు!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్‌.. సీఎం పదవి కోసమే రోడ్లపై తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. నేను సినిమా హీరోను.. సీఎం పదవి ఇచ్చేయమంటే ప్రజలు పవన్‌కు అధికారాన్ని ఇవ్వరని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో పవన్‌ సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి కూడా సీఎం పదవి కోసం ఇలానే తిరిగారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సినిమా హీరోలను ముఖ్యమంత్రులుగా ఆదరించే పరిస్థితి రాష్ట్రంలో లేదని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు మాత్రమే ప్రజలు ఓట్లేసి సీఎంగా ఆదరించారని వర్ల రామయ్య అన్నారు