దేశమంతా భాజపావైపే చూస్తోంది – కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. పార్టీ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే  రాష్ట్రంలో పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశం లేదన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు. దేశమంతా భాజపావైపే చూస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు. భాజపాలో చేరడంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇక అంతా అయిపోయింది.. చేసేదేమీ లేదంటూ దెప్పిపొడిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా లాభంలేదన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పట్టించుకునే పరిస్థితి లేదంటూ పార్టీపైనా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాపైనా ఘాటు విమర్శలు చేశారు.