తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,761కి చేరింది. కరోనాతో ఇవాళ ముగ్గురు మృతి చెందగా.. ఇప్పటి వరకు 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇవాళ కరోనా నుంచి కోలుకొని ఏడుగురు డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు 1,043 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 670 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 118 మంది వలస కార్మికులు కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.